యధార్థంలోని అంతరార్థాన్ని, అంతరార్థంలోని పరమార్థాన్ని, పరమార్థంలోని సంపూర్ణ తత్వాన్ని గ్రహించడమ తత్వం . ప్రతి మనిషి ఆ తత్వంలో బ్రతకడమే అసలైన జీవితం! ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక దైవాన్ని కానీ ప్రోత్సహించడం కాకుండా మానవత్వంలోను, దైవత్వంలోను నిరంతరం నిన్ను నడిపించడం, నీలో ఉన్న అసలైన నిన్నును నీకు పరిచయం చేయడమే తత్వపీఠం లక్ష్యం. సర్వజన సేవయే సర్వేశ్వర సేవగా ఈ 'తత్వపీఠం'  సాత్వికమైన, స్వచ్ఛమైన, ఆధ్యాత్మిక, సామజిక, ధర్మయుద్ధం చేయడానికి సిద్ధమైనది. 

మన సనాతన హైందవ సాంప్రదాయాలు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సామజిక దృక్పథంతో కూడుకొని ఉండే సంస్కృతి. ఇటువంటి సాంప్రదాయంలో కోటానుకోట్ల దేవతలు ఉన్నారు. మరి ఏ దేవున్ని పూజించాలి? ఏ దేవున్ని ఆరాధించాలి? ఈ ఆరాధించే క్రమంలో దేవుని రూపాన, దేవుని నామాన, దేవుని పూజా కర్మలలో ఉండే శ్రద్ధ, భక్తిలో లేదు! ఆధ్యాత్మికతలో లేదు!! అంటే ఇక్కడ దేవుడు ప్రోత్సహించ బడకూడదు. దైవశక్తి ప్రోత్సహించబడాలి. పూజాది కర్మలు ప్రోత్సహించబడకూడదు. భక్తి ప్రోత్సహించబడాలి. మానసిక పూజ, మానసిక ధ్యాస, మానసిక కర్మ నిర్వహించబడాలి. అందుకే, తత్వపీఠం దైవాన్ని ప్రోత్సహించకుండా దైవ మార్గాన్ని ప్రోత్సహిస్తుంది. దైవనామ రూపాన్ని ప్రేరేపించకుండా, దైవశక్తి ని ప్రేరేపిస్తుంది. అలాగే, మనిషి సంపూర్ణ వ్యక్తిత్వంతో పరిపూర్ణ మానవత్వంతో ఉండాలంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గం కాదు. సామజిక సేవ కూడా ప్రధానం. సేవే లక్ష్యమై, సేవే ధర్మమై , సేవే సత్యమై, సేవే ప్రధానమై నీలో నిండాలి. తోటి మనిషికి న్యాయం, సాటి మనిషికి సాయం అందించే గుణం నీలో స్థిరమై ఉండాలంటే నీలో ఉన్న సామజిక కోణాన్ని తత్వబాణంతో చైతన్య పరిచి సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దడమే 'తత్వపీఠం' మార్గం!